మల్లన్నసాగర్‌కు అదనపు టీఎంసీ నీటిని మళ్లించేందుకు కాలువ తవ్వాలా? లేక సొరంగం చేపట్టాలా? అన్నదానిపై నీటిపారుదల శాఖ తర్జనభర్జన పడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు, ఇక్కడి నుంచి మల్లన్నసాగర్ వరకు రెండో టీఎంసీ నీటిని మళ్లించే పనికి గత ఏడాది టెండర్లు ఖరారు చేసింది. ఇందులో మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి అప్పగించింది.
మూడో ప్యాకేజి పనిలో చిన్నగుండవళ్లి నుంచి తుక్కాపూర్ వరకు కాలువ తవ్వకం, కాలువపైన స్ట్రక్చర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇక్కడి నుంచి కొత్తగా నిర్మించే పంపుహౌస్ ద్వారా మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. మూడో ప్యాకేజి పనిలో 14 కి.మీ దూరం కాలువ తవ్వకం, నిర్మాణాలు చేయాల్సి ఉండగా, రూ.680.90 కోట్లకు గుత్తేదారుకు అప్పగించారు. ఈ పనికి 800 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది.
చిన్నగుండవెళ్లి, ఇరుకోడు, తోరణాల తదితర గ్రామాల నుంచి కాలువ వెళ్తుందని, ఇక్కడ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రాంతమంతా సిద్దిపేటకు సమీపంలో ఉండటంతో భూముల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం చెల్లిస్తే నామమాత్రంగానే వస్తుంది. అక్కడున్న ధరలో ఐదో వంతు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులనుంచి సానుకూలత రాదని, ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గాన్ని ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే సొరంగాలు ఎక్కువగా తవ్వడం, ఇందులో ఎదురవుతున్న సమస్యలు, పనిలో జాప్యం వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని కాలువ తవ్వకమే మేలన్నది ప్రభుత్వ అభిప్రాయంగా ఉన్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: సమీకృత రైతుబజార్‌పై నగరవాసుల హర్షం