కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... దిల్లీలో అలుపెరుగని పోరు సాగిస్తున్న అన్నదాతలకు మద్దతుగా... హైదరాబాద్‌లో రైతులు తలపెట్టిన ర్యాలీకి హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చింది. సరూర్‌నగర్ స్టేడియం నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ర్యాలీ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ర్యాలీలో ట్రాక్టర్లు వినియోగించరాదని, ద్విచక్రవాహనాలు, కార్లను మాత్రమే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అనుమతించాలంది. ర్యాలీని మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించవచ్చంది.
రైతుల ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ర్యాలీ జరిగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ నగర్ కూడలి నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ వరకూ రహదారిపై వాహనాలను అనుమతించరు.
విజయవాడ, వరంగల్ నుంచి వచ్చే వాహనదారులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడ పోయేవారు సరూర్ నగర్, ఉప్పల్ వైపు రాకుండా ఓఆర్ఆర్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలని సూచించారు.
ఇదీ చూడండి : ఐస్‌క్రీంను విడుదల చేయనున్న ఎంపీ, మంత్రులు