రాష్ట్ర తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కే భవన్‌లోని ఒక విభాగాధికారి దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన సదస్సులో పాల్గొని వచ్చినట్లు తేలడం కలకలం రేపుతోంది. ఆ అధికారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన మార్చి 13 నుంచి 16 వరకు దిల్లీలో మత సదస్సులో పాల్గొని వచ్చారు. నాటి నుంచి తాత్కాలిక సచివాలయంలో విధులకు హాజరవుతున్నారు. కాగా మంగళవారం విశ్వసనీయ సమాచారం తెలియడం వల్ల ఉన్నతాధికారులు అతన్ని ప్రశ్నించారు. తాను దిల్లీకి వెళ్లివచ్చిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నాడు. దీనితో ఆ అధికారిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్ష కోసం నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.
తాత్కాలిక సచివాలయంలో వేయి మందికిపైగా పనిచేస్తున్నారు. మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులున్నారు. దీనితో ఇక్కడ కరోనా ఉనికిపై ఆందోళన వ్యక్తమయింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, అధికారి గురించి విచారణ జరపాలని, సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: 'మీ వల్లే కరోనా ప్రభావిత ప్రాంతాలు పెరిగాయి'