హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లోని చారిత్రాత్మక దత్తాత్రేయ గుట్టపై ఆలయ ప్రహరీ గోడ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడున్నర సమయంలో దత్త భగవానుడికి అభిషేకం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి వర్షం కురవడం వల్ల ఆలయంలో భక్తుల రద్దీ పెద్దగా లేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సీతారాబాగ్ ఆలయంలో దాదాపు 300 అడుగుల ఎత్తులో దత్త భగవానుడు కొలువు దీరి ఉన్నాడు. ఆలయం చుట్టూ గ్రిల్స్‌తో ప్రహరీ నిర్మించారు. ఉదయం పూజ జరుగుతున్న సమయంలో పెద్దగా శబ్దం చేస్తూ.. ప్రహరీ కూలిపోయి.. శిధిలాలు మెట్ల దారి వైపు పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు పెద్దగా లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఆలయానికి వచ్చే భక్తులు గ్రిల్స్ దగ్గర నిలబడి నగర అందాలు చూస్తుంటారు. గత నాలుగు రోజులుగా వర్షం, మరోవైపు కరోనా నిబంధనల వల్ల ఆలయంలో పెద్దగా భక్తుల రద్దీ లేదు. భక్తులు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే.. పెద్ద ప్రాణనష్టం సంభవించేదని స్థానికులు అంటున్నారు.
దాదాపు 40 అడుగుల వరకు గ్రిల్స్ కూలిపోగా.. మరో మూడు గ్రిల్స్ గాలిలో వేలాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే.. మిగిలిన గ్రిల్స్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ఆలయానికి అభిముఖంగా ఏర్పాటు చేసిన షెడ్డు కూడా భారీ ఈదురుగాలులు, వర్షానికి ఎగిరిపోయింది.
దాదాపు 40 మీటర్ల దూరం ఎగిరి.. పక్కనే నిర్మానుష్యంగా ఉన్న మరో గుట్టపై పడింది. కాగా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇప్పటి వరకు అధికారులు స్పందించి, ఈ షెడ్డు తొలగించలేదు. దీనికి తోడు.. తాజాగా మరో ప్రమాదం జరగడం వల్ల ఆలయ పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు