ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని... యూటీఎఫ్ (Ts Utf) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కరోనా వైద్య ఖర్చుల రిఎంబర్స్ మెంట్ పరిమితిని పెంచాలని కోరింది. ఎన్నికల విధులు నిర్వహించి... కరోనాతో మరణించిన ఉపాధ్యాయులకు పరిహారం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ (Ts Utf) రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చావ రవి స్పష్టం చేశారు. మార్చి 22న ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, అంతర్జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల కాకపోవటం విచారకరమన్నారు.
రెండు నెలల కాలంలో 300 మంది ఉపాధ్యాయులు కరోనాతో మరణించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విధులు నిర్వహించిన అనంతరం వందలాది ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. వీరందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లదేనని స్పష్టం చేశారు. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు ఎన్నికల నిబంధనల ప్రకారం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని... కుటుంబాల వైద్య ఖర్చులను భరించాలని టీఎస్ యూటీఎఫ్ (Ts Utf) డిమాండ్ చేసింది.