సూపర్ మ్యాన్, థోర్, థానోస్, హల్క్.. వీళ్ల శక్తులు మనకూ ఉంటే బావుండనుకుంటారు పిల్లలు, పెద్దలు. ఈ శక్తులు నిజంగా రాకున్నా.... వాళ్లలాగే తయారై ఆ పాత్రల్లో లీనమై నటించే అవకాశం వస్తే మాత్రం ఎవరైనా ఎగిరిగంతేస్తారు. అలాంటి అవకాశాన్నే కల్పిస్తోంది కామికాన్ ఇండియా ప్రదర్శన. యానిమేషన్, సినిమాలు, కామిక్ పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్, కామిక్ ఆటలు... ఈ ఐదు విభాగాల్లోని కల్పిత పాత్రలతో ప్రేక్షకులు స్వయంగా అనుభూతి పొందేలా చేయడమే ఈ ప్రదర్శన ఉద్దేశం.
ఏడేళ్లుగా సాగుతున్న కామికాన్..
విదేశాల్లో విస్తృతంగా జరిగే ఈ ప్రదర్శనలు.. గత కొన్నేళ్లుగా భారత్‌కు విస్తరించాయి. కామికాన్ ఇండియా వ్యవస్థాపకుడు జితిన్ వర్మ ఆధ్వర్యంలో ఏడేళ్లుగా ఈ ప్రదర్శనను అట్టహాసంగా నిర్వహించారు. యాభై వేల మందికిపైగా కళాశాల విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని తమకిష్టమైన పాత్రలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. స్వీయచిత్రాలు దిగుతూ సంబరపడిపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు.. కామిక్ పాత్రలకు సంబంధించిన వస్తువులు, పోస్టర్లు వంటివి పిల్లలకు కొనిచ్చి.. వారిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు.
వివిధ వేషధారణల్లో కాస్ ప్లేయర్స్..
లీగ్ ఆఫ్ లెజెండ్స్‌కు చెందిన ఐరీలియా, అవతార్‌లోని నేతిరి, డెడ్ పూల్ బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా, డెత్ డీలర్ లాంటి పాత్రల వేషధారణతో యువతీ యువకులు ఆకట్టుకున్నారు. కాస్ ప్లేయర్స్‌గా పిలిచే వీరంతా తమ అభిమాన నటుల పాత్రల వేషధారణతో ప్రదర్శన ప్రాంగణంలో తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విచిత్ర వేషాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ పోటీలో పాల్గొన్నారు. వారిలో ఉత్తమ కాస్ ప్లేయర్‌గా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
'నెలరోజుల ముందు నుంచే సన్నద్ధమయ్యాం'
ఇలాంటి ప్రదర్శనలు వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ నేర్చుకునే తమలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయని యానిమేషన్ విద్యార్థులు తెలిపారు. కామికాన్ ప్రదర్శన కోసం నెల రోజుల ముందు నుంచే సిద్ధమయ్యామని చెబుతున్న విద్యార్థినీ విద్యార్థులు... ఉత్సాహాంగా ఈ ప్రదర్శనలో పాల్గొని సందర్శకులకు కావల్సినంత వినోదాన్ని పంచారు.
రామాయణ, మహాభారత పాత్రలనూ పరిచయం చేయాలి..
హాలీవుడ్ చిత్రాలను అమితంగా ఇష్టపడే చిన్నారుల దగ్గరి నుంచి పలువురు సినీ దర్శకులు, నటీనటులు కూడా కామికాన్కు హాజరై సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్, యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ముఖ్యఅతిథులుగా హాజరై థానోస్‌తో స్వీయ చిత్రాలు దిగుతూ సందర్శకులను ఆకట్టుకున్నారు. హాలీవుడ్ పాత్రలే కాకుండా నేటి తరానికి రామాయణ, మహాభారతంలోని పాత్రలను కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆద్యంతం ఎంతో వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ఈ కామికాన్ ప్రదర్శన సందర్శకుల్లో ప్రపంచ సినీరంగంపై ఎనలేని అభిమానాన్ని పెంచుతోంది. వచ్చే ఏడాది ఈ ప్రదర్శనను అహ్మదాబాద్, హైదరాబాద్ వేదికగా మరింత పెద్ద ఎత్తున నిర్వహించాలని కామికాన్ నిర్వాహకులు భావిస్తున్నారు.