హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని బతుకమ్మ కుంట ప్రజలు గత 14 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు, అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ డంపింగ్ యార్డును మార్చలేదు. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ ప్రదేశాన్ని రాంకీ సంస్థకు దారాదత్తం చేసినట్లు, అలాగే కొంచెం పెద్దగా నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో బతుకమ్మ కుంట, నందనవనం, సాయి మధురానగర్ కాలనీవాసులు అభ్యంతరం చెబుతూ ధర్నాకు దిగారు.
గత 14 సంవత్సరాల క్రితం కేవలం ఆరు నెలలు మాత్రమే డంపింగ్ యార్డు ఉంటుందని.. తర్వాత ఇక్కడ పార్కు అభివృద్ధి చేస్తామని అప్పటి మున్సిపల్ కమిషనర్ చెప్పడం వల్ల వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఆ డంపింగ్ యార్డ్ తరలించగా పోవడం వల్ల, కాలనీల్లో తీవ్రమైన దుర్వాసనతో విపరీతమైన దోమలతో అనారోగ్యాల పాలవుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై రోజుల క్రితం ఇదే డంపింగ్ యార్డ్ ప్రదేశంలో రోడ్డుపై సులబ్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఇప్పుడు ఇంకో సంస్థకు అప్పజెప్తున్నట్లు చెప్పడం ఏంటని తెలిపారు. ఈ ధర్నాకు భాజపాతో పాటు వామపక్షాలు తమ మద్దతును తెలియజేశాయి.
ఇదీ చదవండి: భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్‌పై దాడి