భారీ వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో (Huge Loss Due to Heavy Floods in Kadapa) రూ. 140 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. వరద బీభత్సానికి 24 మంది మృతి చెందారని.. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు వెల్లడించారు. గల్లంతైన మరో 13 మంది మందికి కూడా పరిహారం ఇస్తామన్నారు. అధికంగా దెబ్బతిన్న ఇళ్లకు 95 వేలు, పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించేందుకు రూ. 1.80 లక్షల చొప్పున వెచ్చిస్తూ గృహాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన బాధితుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూములు, ఆస్తుల పత్రాలను కొత్తవి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
75 వేల హెక్టార్లలో పంట నష్టం..
ఈ నెల18 నుంచి 19వ తేదీ ఉదయం వరకు భారీ వర్షం వల్ల అన్నమయ్య జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో 19న తెల్లవారుజామున జలాశయం కట్ట తెగిపోయిందన్నారు. దీంతో ప్రధానంగా ఆరు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని వెల్లడించారు. చెయ్యేరు నది ప్రవాహానికి 12 ప్రభావిత గ్రామాలు దెబ్బతిన్నాయని తెలిపారు. అధికారులు అప్రమత్తం కావడంతో భారీగా ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అన్నమయ్య ప్రాజెక్టు, చెయ్యేరు, పాపాగ్ని, పెన్నా.. నదుల వరద ఉద్ధృతి కారణంగా... పంటలు, నిర్మాణాల మొత్తం దాదాపు రూ. 140 కోట్ల ఆస్తినష్టం(Floods Damage in Kadapa) జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. 75 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. చాలా వరకు ఉద్యాన పంటలు నష్టపోయాయన్నారు. పలు ఇరిగేషన్ నిర్మాణాలు, రోడ్లు, బ్రిడ్జీలు ధ్వంసం అయ్యాయన్నారు. భారీ స్థాయిలో రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో.. వాటిని తాత్కాలికంగా త్వరలో పునరుద్దరింపజేసి.. శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళికలను ప్రభుత్వం చేపట్టనుందన్నారు.
గ్రామాల్లోని ప్రజాసమస్యలపై నివేదికలు
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. రూ. 5 కోట్ల సీఎస్ఆర్ నిధులను వరద బాధితులకు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. 'వరదల్లో పూర్తిగా నష్టపోయిన 1,322 మంది బాధితులకు ప్రభుత్వ తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున పంపిణీ చేయడం జరిగిందన్నారు. వరదలకు సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. అలాగే వరద ప్రాంతాల్లోని సమస్య పరిష్కారం కోసం డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఓ అధికారిని నియమించాం. వారు ప్రతీ మంగళ, శనివారాల్లో గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజాసమస్యలు తెలుసుకుంటారు. పంట, పశు నష్టం, గృహాలు, పాఠశాలలు ఇలా.. అన్ని రకాల నష్ట సంబంధించి నివేదిక తయారు చేస్తున్నాం' అని కలెక్టర్ విజయరామరాజు (Kadapa collector vijayaramaraju on loss due to floods) వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ గౌతమి, సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి.. Kadapa Floods: కంటికి కునుకు లేదు... తినడానికి తిండీ లేదు..