బల్దియాలోని పరిపాలన విభాగంలో పదోన్నతుల కోసం వసూళ్ల పర్వం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా... కమిషనర్, అదనపు కమిషనర్ కార్యాలయాల్లోని అధికారులు ఈ తతంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయ మున్సిపల్ కమిషనర్‌గా (ఏఎంసీ) పదోన్నతి కావాలంటే రూ.25వేలు ఇస్తే జాబితాలో పేరు చేర్చి ప్రభుత్వానికి పంపిస్తామంటున్నారు. ఇందుకోసం వాట్సాప్‌లో ‘క్వాలిఫైడ్ సూపరింటెండ్స్’ అని గ్రూపు ఏర్పాటు చేయడం గమనార్హం.
వసూళ్లకు పక్కా ప్రణాళిక..
గతంలో పదోన్నతులు ఇచ్చినప్పుడు, తమకు వాటా దక్కలేదని ఆందోళన చెందిన పరిపాలన విభాగం ఉన్నతాధికారి కినుక వహించారు. అప్పట్నుంచి వసూళ్లకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం వంద మంది సూపరింటెండెంట్‌లు సీనియారిటీ ప్రకారం ఏఎంసీ హోదాకు అర్హులు. పలువురు శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. మరికొందరిపై ఏసీబీ, విజిలెన్స్ రిమార్కులున్నాయి. కేవలం 32 మందిని పదోన్నతికి సిఫార్సు చేస్తూ పరిపాలన విభాగం దస్త్రాన్ని సిద్ధం చేసింది. పదవీ విరమణ పొందనున్న పురపాలకశాఖలోని ఉన్నతాధికారితో ఆ దస్త్రాన్ని ఆమోదింపజేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆశావహుల నుంచి ఇప్పటి వరకు రూ.3.5లక్షలు వసూలైంది.’’అని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. దీనికన్నా ముందు తయారైన ఆశావహుల దస్త్రం డబ్బులివ్వని కారణంగా అటకెక్కిందని గుర్తుచేశారు.
గతంలోనూ ఇంతే..
కమిషనర్ అనుమతి తీసుకుని ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్ గతంలో ఓ అధికారిపై వేటు వేస్తూ, మాతృసంస్థకు పంపించాలని పరిపాలన విభాగాన్ని కోరారు. ఆ విభాగంలోని ఓ అధికారి ఆ దస్త్రాన్ని ఆపుతానంటూ, వేటుకు గురైన అధికారితో రూ.2.5లక్షలు తీసుకొని దస్త్రాన్ని తొక్కిపెట్టారు. విషయం తెలుసుకున్న కమిషనర్.. ఆ అధికారిని వేరే శాఖకు బదిలీ చేశారు.