త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని అయ్యాక శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ముంబయి, దిల్లీతో పోటీపడేలా విశాఖ అభివృద్ధి చెందుతుందన్న బొత్స... అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అమరావతి అంతర్భాగమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిని సకల హంగులతో మేటి ప్రాంతంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ బాధ్యతన్న బొత్స... అనుకున్న విధంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. విశాఖలో ఎక్కువ భూసేకరణ అవసరం లేదని సీఎం అన్నారని బొత్స వివరించారు.
విశాఖలో ప్రభుత్వ భూములే ఎక్కువ వాడుకుంటామన్న మంత్రి... భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స వివరించారు.