గ్రామ పంచాయతీల తరహాలోనే జిల్లా, మండల పరిషత్‌లకూ నిధులు కేటాయిస్తామని, నిర్దిష్టమైన విధులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. నిధుల కొరత లేకపోవడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సీఎం... గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపుయార్డులు, నర్సరీలు, వైకుంఠథామాలు సమకూరాయని చెప్పారు.
ఇదే తరహాలో జిల్లా, మండల పరిషత్‌లకూ ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ నిధులను ఉపాధి హామీ లాంటి పథకాలతో అనుసంధానించడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. అధికారుల సూచనలపై జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లతో స్వయంగా చర్చించి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి తెలిపారు. 2021-22 బడ్జెట్లోనే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
కొన్ని చోట్ల రెండు లక్షలు మించిన పనుల మంజూరుకు మండల అధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నారని... ఇది కొత్త చట్టానికి విరుద్ధమన్నారు. గ్రామ పంచాయతీలు తమ నిధులను గ్రామ అవసరాలు తీర్చేందుకు సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉందని, ఇందులో ఎవరి జోక్యం అక్కర్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరోమారు స్పష్టత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం