CM Revanth Reddy Delhi Tour Today : తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని తెలియజేశారు. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని అమిత్ షాను రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగానే స్పందిస్తూ 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనంగా అధికారులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను దిల్లీ నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు చేశారు.
రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూదిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టిసారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాము : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించండి : హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లోని మూసీ రివర్ ఫ్రంట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామని చెప్పారు. అందుకు కేంద్రం నుంచి తగిన సహాయం కావాలన్నారు. అలాగే అమ్యూజ్‌మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, బిజినెస్ ఏరియా, దుకాణ సముదాయాలతో బహుళ విధాలా ఉపయోగపడేలా చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రికి వివరించారు.
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించండి : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు. జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాధాన్యతను కేంద్ర మంత్రికి వివరించారు. కరవు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి సాగు నీరు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆరు జిల్లాల పరిధిలోని 1226 గ్రామాలతో పాటు హైదరాబాద్ మహా నగరానికి తాగు నీరు సరఫరా చేయాల్సి ఉందన్నారు.
పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి