CM Revanth Reddy Davos Tour : తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్(CM Revanth) దావోస్ పర్యటన సాగనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక ద్వారా చాటి చెబుతామని ఆయన వివరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొననున్నారు.
యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విదేశీ, భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకొని కొత్త ప్రభుత్వ విజన్, ప్రాధాన్యతలను వివరించడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అవకాశం ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ ప్రాధాన్యతలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇదొక చక్కటి వేదికగా ఆయన పేర్కొన్నారు.
CM Revanth Participate in Davos Meeting : మూడు రోజుల దావోస్ పర్యటనలో(Davos Meeting) తనతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారుల బృందం దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు వివరించారు. తాము సమావేశం కాబోతున్న వారిలో నొవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెంకా, గూగుల్, ఉబర్, మాస్టర్‌కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎఫ్‌వోలు ఉన్నారన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అవ్వడమే కాకుండా సీఐఐ, నాస్కమ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం
దావోస్ పర్యటన విజయవంతం కావడానికి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడం లేదని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో కూడా పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. మొదటిసారి దావోస్ వెళ్తున్న సీఎంగా రేవంత్ రెడ్డికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో మాట్లాడాల్సిందిగా ఆహ్వానించినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.
"ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్" అనే అంశంపై జరగనున్న అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని అగ్రి- ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ఆధారంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని వివరించారు. ఏఐ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్నచర్చా వేదికలో "డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఏఐ" అనే అంశంపై తాను మాట్లాడడమే కాకుండా టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా కలుసుకుంటానని శ్రీధర్‌బాబు తెలిపారు.
దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే బోర్జ్తో సమావేశం అవుతామని పేర్కొన్న శ్రీధర్‌బాబు తెలంగాణతో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు బలమైన వ్యవస్థీకృత సంబంధాలు ఉన్నాయన్నారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ సదస్సు హైదరాబాదులో జరగబోతోందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాల్లో సాంకేతిక ఉపక్రమణలకు ఆ సంస్థ క్రియాశీలకంగా మద్దతిస్తోందని శ్రీధర్‌బాబు వివరించారు.
నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు : సీఎం రేవంత్ రెడ్డి