Telangana New Secretariat Inauguration Today: నాలుగు కోట్ల ప్రజానీకం ఆకాంక్షలను నెరవేర్చేలా ఆత్మగౌరవ ప్రతీకగా.. సంప్రదాయం, ఆధునికత, సాంకేతికత మేళవింపుగా ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించింది. రికార్డు సమయంలో పూర్తి చేసుకొని రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తున్న సమీకృత సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1:20 నిమిషాల నుంచి 1:32 నిమిషాల మధ్య సచివాలయ ప్రారంభ కార్యక్రమం పూర్తి కానుంది.
Inauguration of Telangana New Secretariat Today: నిర్ణీత ముహూర్తమైన మధ్యాహ్నం 1:20 నిమిషాలకు సీఎం కేసీఆర్ సచివాలయం చేరుకుంటారు. రహదార్లు - భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు ఆయనకు స్వాగతం పలుకుతారు. యాగశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్న అనంతరం భవన ప్రధాన ద్వారం ఎదురుగా పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. ఆ తర్వాత గ్రాండ్ ఎంట్రీ వద్ద ఫలకాన్ని ఆవిష్కరించి.. నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
సీఎం కేసీఆర్ చేతుల మీదగా నూతన సచివాలయం ప్రారంభం: అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కింది అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి వెళ్లి అక్కడ వాస్తుపూజలో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా తన కార్యాలయం ఉన్న 6వ అంతస్తుకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఛాంబర్లో పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులవుతారు. వెంటనే ఒక ముఖ్యమైన దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం 1:32 నిమిషాలలోపు పూర్తి కానుంది. ఆ తర్వాత మండలి ఛైర్మన్, శాసనసభాపతి, మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి సీఎం కేసీఆర్ను అభినందిస్తారు.
CM KCR to Inaugurate Telangana New Secretariat: సీఎం కేసీఆర్ కుర్చీలో ఆసీనులు అయిన అనంతరం మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం 1:58 నుంచి 2:04 వరకు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే పూర్తి కానుంది. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
ఇవీ చదవండి: