గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు అందుతున్న చికిత్సను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... వారిలో భరోసాను నింపి ధైర్యాన్నిచ్చారు. రోగులతో మాట్లాడి చికిత్స, భోజనం గురించి ఆరా తీసిన సీఎం... సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని వైద్యులు, సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి... వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సను పరిశీలించి రోగులకు భరోసా కల్పించేందుకు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా సీఎం వెంట ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ రోగులున్న వార్డులను కలియ తిరిగిన సీఎం.. వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి తానున్నానే భరోసా, ధైర్యాన్ని ఇచ్చారు. రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ, అత్యవసర, ఔట్ పేషెంట్ వార్డులు సహా పలు జనరల్ వార్డులను సీఎం సందర్శించారు. పడకల వద్దకు వెళ్లి రోగులతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ధైర్యం చెప్పిన సీఎం..
కరోనా రోగులకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి... చికిత్స, భోజనం గురించి వారిని ఆరా తీశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే వైద్యాధికారులకు ఆదేశాలిస్తూ ముందుకు కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలన్న నిర్ణయాని అనుగుణంగా గాంధీలో ఏర్పాటు చేసిన ప్లాంటును సీఎ కేసీఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేసే ఈ ప్లాంటును ఇటీవలే ఏర్పాటు చేశారు. ప్లాంటు మొత్తంలో కలియతిరిగిన ముఖ్యమంత్రి... పనివిధానం, ఆక్సిజన్ స్వచ్ఛత గురించి గాంధీ సూపరింటెండెంట్ రాజారావును అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన సీఎం..
గాంధీ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న ఒప్పంద నర్సులు, జూనియర్ వైద్యులతో సీఎం స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. ఎటువంటి ఇబ్బందులున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువవైద్యులుగా వారిపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రతిపాదనలు పంపండి..
జూనియర్ వైద్యులు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారన్న సీఎం... సేవలను ఇలాగే కొనసాగించాలని కోరారు. ఏ సమస్య, అవసరం ఉన్నా తనను సంప్రదించాలన్న కేసీఆర్... సంపూర్ణ సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: 'నిరంతరం కొత్తరూపంలోకి వైరస్.. సమగ్ర అధ్యయనం అవసరం'