CM KCR Jagtial tour today: ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది. ఎటు చూసినా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో పట్టణం కోలాహలంగా మారింది. జగిత్యాలలో పర్యటించనున్న కేసీఆర్ కలెక్టర్ సముదాయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నూతనంగా ఏర్పాటైన వైద్య కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం జగిత్యాల పట్టణానికి అనుకుని ఉన్న మోతెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని, ప్రసంగించనున్నారు. దాదాపు 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రెండు లక్షల మంది తరలి రానున్నట్లు టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
కవిత వ్యాఖ్యలు: అయితే సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత.. జగిత్యాల నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కానుందని తెలిపారు. ఈ కేసీఆర్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివెళ్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో కనివినీ ఎరుగని రీతిలో జగిత్యాల అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం పర్యటన వేళ.. విషాద ఘటన: ఇది ఇలా ఉండగా సీఎం పర్యటన వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం బందోబస్తుకు వచ్చిన పరుశురాం అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఓదెలు గ్రామానికి చెందిన పరుశురాం ఇంద్రవెల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా బందోబస్తు కోసం జగిత్యాలకు కానిస్టేబుల్ వచ్చారు. ఈ క్రమంలో నిన్న రాత్రి పోలీసులకు వసతి ఏర్పాటు చేసిన చోట ఆయనకు గుండెపోటు రావడంతో.. గమనించిన సహచరులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే కానిస్టేబుల్ పరశురాం మృతి చెందారు.
ఇవీ చదవండి: