అటవీ భూముల సర్వే చేపట్టడంతో పాటు త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు చెప్పారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవి బిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని.. మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలు, స్వచ్ఛమైన, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని అన్నారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఆదివాసీ గూడేల్లో విద్య, వైద్యం, తాగు నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కోసం పటిష్ఠ చర్యలు ప్రభుత్వం చేపట్టిందని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య సౌకర్యాల కల్పనతో గతంలో మాదిరిగా విష జ్వరాలతో ఆదివాసీలు మరణించే పరిస్థితిని నివారించామని తెలిపారు. మా తండాలో.. మా గూడెంలో మా రాజ్యం అనే ఆదివాసీ, గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్న కేసీఆర్.. స్వయం పాలనలో భాగస్వామ్యులను చేసే దిశగా ఆదివాసీ గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని వివరించారు.
పోడు భూములకూ రైతుబంధు..
మిషన్ భగీరథ ద్వారా అత్యంత సుదూరంలోని ఆదివాసీ గూడేలకూ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. పోడు భూములకు కూడా రైతుబంధు అందిస్తున్నామన్నారు. తెలంగాణ ఆదివాసీ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా.. హైదరాబాద్లోని అత్యంత విలువైన బంజారాహిల్స్ ప్రాంతంలో కుమురం భీం భవనం ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు.
అందుకోసం ప్రత్యేక చర్యలు..
ఆదివాసీల దేవతలైన సమ్మక్క-సారలమ్మ సహా నాగోబా, సేవాలాల్ మహరాజ్ జాతరలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతోన్న ఆదివాసీ బిడ్డల కోసం, 'గిరి పోషణ్' పేరుతో పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తోందని.. సీఎం ఎస్టీ ఎంటర్ప్రిన్యూర్షిప్ పథకం కింద ఆదివాసీ గిరిజనులను పారిశ్రామికవేత్తలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చూడండి: SATYAVATHI: గత పాలకులది ఓటు రాజకీయం.. తెరాసది సంక్షేమ మార్గం