CM KCR on Birth Anniversary of Basaveshwara: సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి కాలం ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్‌లు, లింగ బలిజలు ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. వారు జాతికి చేసిన సేవలను, బోధనలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆ నాటి సమాజంలో నెలకొన్న మత చాంధస విలువలను సంస్కరిస్తూ.. సాంఘీకదురాచారాల మీద పోరాటం చేయడమే కాకుండా, వర్ణ వివక్ష, కుల వివక్ష, లింగ వివక్ష లేని సమాజం కోసం దాదాపు 900 ఏళ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడని సీఎం కొనియాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసఆర్ మాట్లాడారు. 'అనుభవ మంటపం' వ్యవస్థను ఏర్పాటు చేసి అన్ని కులాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించి.. నాటి కాలంలోనే పార్లమెంటరీ ప్రజస్వామిక పాలనకు బీజాలు వేశారన్నారు. బసవేశ్వరుని జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. వారి ఆశయాల సాధన దిశగా కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. బసవేశ్వరుని స్పూర్తిని రేపటి తరాలు కొనసాగించేందుకు గుర్తుగా వారి కాంస్య విగ్రహాన్ని ట్యాంకుబండ్ మీద నెలకొల్పుకున్నమని చెప్పారు.
బసవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు నిధులు: హైదరాబాద్ కోకాపేటలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేననే బసవేశ్వరుని సమతా తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. దళిత బహుజన కులాల గిరిజన, మహిళా అట్టడుగు వర్గాల సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ.. బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లో మహారాష్ట్ర నుంచి జోరుగా చేరికలు: ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన నేతలు గులాబీ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్తో కలిసి నడవడానికి వచ్చిన వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మహారాష్ట్ర ఎన్సీపీ కార్యదర్శి దినేశ్ బాబూరావు మడావి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అతని తండ్రి బాబురావు మడావి.. 3 సార్లు ఎమ్మెల్యే, కాంగ్రెస్ హయాంలో సామాజిక, గిరిజన శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
Maharashtra Leaders Joined BRS: వీరితో పాటు పుణె జిల్లా ఎమ్ఎన్ఎస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ సురేశ్ పాటిల్, పాటు గిరిజన హక్కుల సామాజిక కార్యకర్త బోళా శంభాజీ మడావి, చంద్రపూర్ జిల్లాకు చెందిన నేత నామ్ దేవ్ ఆడే, బంజారా సమాజ్ లీడర్, అతుల్ సతీష్ రాథోడ్, గోండ్వానా గణతంత్ర పార్టీకి చెందిన ప్రముఖ నేత, దళిత సామాజిక నేత వీరేంద్ర పాటిల్.. తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఇవీ చదవండి: