నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సాగునీరు, నిరంతర విద్యుత్‌తో తెలంగాణలో వ్యవసాయం జోరుగా సాగుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలే సాగుచేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగు చేసేలా చూడాలన్నారు. ఏఏ పంటలు సాగు చేస్తే రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనం చేయాలని కోరారు. దీనిపై అధికారులు మే 5లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వరిలో సన్నరకాలను ఎక్కువగా సాగు చేసేలా రైతులను చైతన్య పరచాలని చెప్పారు. కొత్తగా నిర్మించే గిడ్డంగుల్లో కోల్డ్ స్టోరేజీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు సరిగ్గా నిర్దేశిస్తే లాభదాయక వ్యవసాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సన్నబియ్యాన్నే ఎక్కువగా పండించాలి !
పంటల ఎంపిక, సాగు పద్ధతుల్లో మార్పు వచ్చేలా కొత్త విధానం రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎరువుల వాడకం, మార్కెటింగ్‌లోనూ మార్పు రావాలన్నారు. ఎక్కువ మంది ప్రజలు సన్నరకాల బియ్యమే తింటున్నారన్నారు సీఎం. ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ సన్న రకాలకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. సాగునీటి వసతి ఉన్నందున సన్న రకాలనే ఎక్కువగా పండించాలని రైతులను కోరారు. వేర్వేరు పంటలు సాగు చేస్తేనే అన్ని పంటలకు డిమాండ్ ఉంటుందన్నారు. తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ ఉన్న పంటలనే పండించాలని రైతులకు సూచించాలని స్పష్టం చేశారు.
కమర్షియల్ పంటలకూ డిమాండ్...
వేరుశనగ, కందులు, పామాయిల్ పంటలకూ మంచి డిమాండ్ ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కూరగాయలు, పండ్ల సాగుపైనా అధ్యయనం జరగాలన్నారు. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్ విషయమై కూడా శాస్త్రీయంగా ఆలోచించాలని అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాములను నిర్మించాలని నిర్ణయించిన సీఎం... నిర్మాణానికి అవసరమయ్యే స్థలాలను వెంటనే గుర్తించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి : కేసీఆర్ రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారు: కోమటిరెడ్డి