వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చించారు. ఈ వానాకాలం నుంచి రాష్ట్రంలో నియంత్రిత విధానంలో సాగు ప్రారంభించిన నేపథ్యంలో పంటల సాగు సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. రైతుబంధు నిధుల పంపిణీ ప్రక్రియపై కూడా సమీక్షించారు.
రైతు బంధు అందని రైతులను గుర్తించి సాయం అందించాలన్నారు సీఎం. 100 శాతం నియంత్రిత పద్ధతిలో సాగుచేయడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సాధించే విజయానికి ఇది నాందిగా అభివర్ణించారు. విత్తనాభివృద్ధి సంస్థలు ఉత్పత్తి చేసే విత్తనాల నిల్వకు శీతల గిడ్డంగి నిర్మిస్తామని వెల్లడించారు.
రూ.25 కోట్లతో అతిపెద్ద ఆల్ట్రా మోడరన్ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. దసరా నాటికి రైతు వేదిక నిర్మాణాలు పూర్తికావాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 99.9 శాతం మంది రైతులకు రైతు బంధు అందిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గత రెండు వారాలుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న సీఎం శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి.