మిడతల దండుపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మరోమారు మిడతల దండు ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత నెలలో 3 దఫాలుగా వచ్చిన మిడతల దండు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కే వచ్చాయని తెలిపారు.
తాజాగా ఓ మిడతల దండు రాష్ట్రానికి 200 కి.మీ దూరంలో ఉందని చెప్పారు. దక్షిణం వైపు ప్రయాణిస్తే తక్కువ సమయంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముందని హెచ్చరించారు. దక్షిణం వైపు వస్తే ఏ క్షణంలోనైనా తెలంగాణకు ముప్పేనని అన్నారు. ఈనెల 20 నుంచి జులై 5 వరకు మిడతల దండు వచ్చే ప్రమాదముందని తెలిపారు.
ఆ సమయంలో మిడతల దండు వస్తే పంటలకు చాలా ప్రమాదమున్నట్లు వివరించారు. మిడతల దండు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 8 జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆదిలాబాద్‌లో సీఎస్ బృందం పర్యటించనుంది. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో భేటీ నిర్వహించి పరిస్థితులు సమీక్షించనున్నది.