దేశానికే ఆదర్శంగా తెలంగాణలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే దూరదృశ్య సమావేశం ద్వారా, క్లస్టర్ల ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో తాను మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయశాఖపై ప్రగతిభవన్‌లో శనివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ‘‘రైతులు ఏ పంటలు వేయాలనేది ప్రభుత్వమే నిర్ణయించాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆహార అవసరాలు, ఇతర ప్రాంతాల్లో డిమాండుకు తగిన పంటలు వేసేలా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలను గుర్తించి.. వాటిని రైతులకు సూచించాలన్నారు. దాని ప్రకారమే సాగు జరగాలని తెలిపారు.
పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయశాఖకు ఉన్న ఆస్తులు, భవనాలు ఇతరత్రా వివరాలు సమగ్రంగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలని.. ఇంకా రైతులకు ఏమి కావాలో గుర్తించాలని సూచించారు. రైతుల నుంచి నిర్ణీత నమూనాలో కచ్చితమైన వివరాలతో సమాచారం సేకరించి.. దానికి అనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.