కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, చికిత్స, లాక్‌డౌన్, పేదలకు అందుతున్న సాయం, ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ సాగిన ఈ భేటీలో తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన వ్యక్తం..
ఆదివారం కూడా గణనీయమైన సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావటంపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం... పరిణామాలు గమనిస్తుంటే వైరస్ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లాల్సి వస్తే వ్యక్తిగత శుభ్రతతో పాటు భౌతికదూరం తప్పక పాటించాలన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరిస్తే... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఫలితం ఉంటుందన్నారు. లేకుంటే ఉపయోగముండదని పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీఎం... అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందునే... లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించి, పరీక్షలు చేసే పని ముమ్మరంగా జరుగుతోందన్న సీఎం... ఎవరైనా పరీక్షలు చేయించుకోకుంటే స్వచ్ఛందంగా వారే ముందుకు రావాలని కోరారు. ఇది వారికి, వారి కుటుంబంతో పాటు రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు.
మరోవైపు....తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం....ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగనుంది.
ఇవీ చూడండి: కేసీఆర్ చెప్పిన 'హెలికాప్టర్ మనీ'కి అర్థమేంటి?