కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 60 వేల మంది వ్యాధి బారిన పడ్డా చికిత్స అందించేందుకు వీలుగా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే ఎక్కువగా పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. 20 వేల మంది క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారి గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూలను వచ్చే నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్దేశించిన గడువు నెలాఖరుతో ముగుస్తోందని, కేంద్రం నిర్ణయించినట్లే వచ్చే నెల వరకు కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ప్రజలు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరారు.
‘‘రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ కనుక అమలు చేసి ఉండకపోతే పరిస్థితి భయంకరంగా ఉండేది. మన అందరి బతుకులు ప్రమాదంలో ఉండేవని ముఖ్యమంత్రి తెలిపారు. లాక్‌డౌన్, కర్ఫ్యూలకు సహకరిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సహకారం లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని... న్యూయార్క్‌లో రాష్ట్రంలో 11 వేల వెంటిలేటర్లు ఉన్నాయి. న్యూయార్క్ సిటీలో మాత్రం 3 వేల వెంటిలేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు.. అక్కడ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వారికిప్పుడు 30 వేల వెంటిలేటర్లు అవసరం. అమెరికా కూడా ఆగమాగం అవుతోందని.... ఈ తీవ్రత గమనించి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
ప్రధానికి ధన్యవాదాలు
'శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడాను. అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ, ఏ సహకారానికైనా కేంద్రం తరఫున వందశాతం సిద్ధంగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. గట్టిగా పోరాడుతున్నారు. దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఒక్కో దశలో ఐసోలేషన్ వార్డుల్లో 11 వేల మంది ఉండేలా, 1400 ఐసీయూలు సహా మొత్తం 12400 పడకలు సిద్ధం చేశాం. 100 మంది అవసరమైన చోట 130 మంది సిబ్బందిని పెట్టుకుంటున్నాం. 500 వెంటిలేటర్లకు ఆర్డర్లు ఇచ్చాం. అవి వస్తున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో 1400 పడకల ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. 11 వేల మంది విశ్రాంత వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నాం. గాంధీ మెడికల్ కాలేజీ, కోఠి ఆస్పత్రిలోనూ ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైతే వైద్య విద్యార్థుల సేవలను తీసుకుంటాం. ప్రభుత్వ ప్రయోగశాలలు నిండితే ప్రైవేటు ల్యాబుల్లో రోగ నిర్ధారణకు అవకాశం కల్పిస్తాం. సీసీఎంబీని వాడుకుంటాం. అక్కడ ఒకేసారి 800 మందిని పరీక్షించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 80.9 శాతం సాధారణంగా ఉండగా 13.8 శాతం మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. మరో 4.7 శాతం కేసుల్లో ఆందోళనకరంగా ఉంది.': సీఎం కేసీఆర్.
ప్రజా ప్రతినిధుల హడావుడి వద్దు
"ఇప్పటికే వైరస్ చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది. దాన్ని మరింత కట్టడి చేయాలి. ప్రజాప్రతినిదులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా తనిఖీలకు, పర్యవేక్షణకు వెళ్లవద్దు. అలా వెళ్లి సమస్యలు సృష్టించవద్దు"
ఏ ఒక్కరూ ఇబ్బంది పడరాదు
"ఈ విపత్కర సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడరాదు. తెలంగాణలో ఉన్న ఏ రాష్ట్రం వారినైనా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. గృహ నిర్మాణం, నీటిపారుదల సహా అనేక రంగాల్లో వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఆశ్రయం కల్పించి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎస్ జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ సహా అన్ని నగరపాలక సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. పురపాలక మంత్రి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. ప్రజలను కట్టడి చేసి కరోనా వైరస్‌వ్యాధిని నిరోధించడమే పనిగా పెట్టుకోవాలని మోదీ చెప్పారు. దానిని అందరం పాటించాలి"
మన పండ్లను ఎగుమతి చేయొద్దు
మన ప్రాంతంలో పండే పండ్లను ఇతర ప్రదేశాలకు ఎగుమతి చేయకుండా మనమే తినేలా చర్యలు తీసుకుంటాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పండ్ల వాహనాలను అడ్డుకోం. పాలు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరకుల వాహనాలు తిరగాల్సిందే. పశుగ్రాసం తీసుకెళ్లే వాహనాలను అనుమతిస్తారు. దీనిపై సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
అమెరికా, ఇటలీ, చైనా, స్పెయిన్ స్థాయిలో వస్తే మన దేశంలో 20 కోట్ల మంది కరోనా బారిన పడే అవకాశం ఉంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. దయచేసి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆపత్కాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం సరికాదు. ఈ జబ్బుకు మందులేదు. ఒకరికొకరు దూరంగా ఉండటాన్ని మించిన నివారణ మార్గం మరొకటి లేదు.
చికెన్, గుడ్లు భేషుగ్గా తినొచ్చు
కరోనా నియంత్రణ కోసం శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని కొందరు దుర్మార్గులు ప్రచారం చేస్తున్నారు. చికెన్, గుడ్లు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. సి-విటమిన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మ, సంత్రాలు, బత్తాయిలతో పాటు దానిమ్మ పండ్లు రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు బాగా ఉపయోగపడుతాయి. మామిడి పండ్లు కూడా బ్రహ్మాండంగా తినొచ్చు.
"రాష్ట్రంలో పండిన వరి, మక్కలు, ఇతర పంటలకు సంబంధించిన ప్రతీ గింజనూ కొంటాం. మూడు నాలుగు రోజుల పాటు గత్తర కావద్దు. రైతులందరికీ కచ్చితంగా న్యాయం చేస్తాం. కరోనా భయంతో గ్రామాల్లో రాకపోకలకు అడ్డుగా వేసిన రాళ్లను, చెట్లను వెంటనే తొలగించాలి. పంట ఉత్పత్తుల రవాణాకు, అత్యవసర వాహనాలకు ఆటంకం కలగకుండా సహకరించాలి. రాష్ట్రానికి పొట్టచేతపట్టుకుని వచ్చిన కార్మికులు, కూలీలంతా మా బిడ్డలే. వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం. అనాథలు, యాచకులు, గుడారాల్లో నివసించే వారిలో ఏ ఒక్కరినీ ఉపవాసం ఉండనీయం. ఇక్కడ ఉంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని వసతి గృహాలను మూసివేయరు. భోజనం పెడతారు. హాస్టళ్ల నిర్వాహకులు కూడా ప్రభుత్వానికి సహకరించాలి.ఎక్కడి వారు అక్కడే ఉండాలి.’’
అన్నదాతలకు అన్ని విధాలా అండ
రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది, పంట కోత జరగాలి. దీనికి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఐకేపీ కేంద్రాలు ప్రారంభించాం. వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు. గ్రామాల్లోనే పంటలు కొనుగోలు చేస్తారు. రైతులు గుంపులు, గుంపులుగా రావద్దు. సర్పంచులు, ఎంపీటీసీలు సహకరించాలి. ధాన్యం కొనుగోళ్లు ఇతర అంశాలపై ఆదివారం జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నాం. రైతులు పండించిన పంట మొత్తాన్ని ప్రభుత్వం కొంటుంది. మీకు చెక్‌లు ఇస్తాం. ఎవరైనా ప్రైవేటు వ్యాపారులు కూడా మద్దతు ధర చెల్లించి కొనుక్కోవచ్చు. పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురి కావద్దు.
ఏప్రిల్ 10 వరకు సాగునీటి సరఫరా
దేవుని దయ వల్ల ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయి. నేరుగా గానీ, ఆన్ లేదా ఆఫ్ పద్ధతుల్లో నీళ్లు అందుతాయి. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల కింద ఏప్రిల్ 10 వరకు నీటి సరఫరా చేయాలని ఆదేశాలిచ్చాం. బావులు, బోర్లపై ఆధారపడ్డ రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తాం. ఏప్రిల్ 10 వరకు పంటలకు నీటి సరఫరా ఆపొద్దు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...