CM KCR paid tributes to Superstar Krishna సీఎం కేసీఆర్... సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున కృష్ణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన కేసీఆర్... నివాళులు అర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, అజయ్.. తదితరులు కృష్ణ పార్థివదేహానికి పూలమాల వేసి... నివాళులు తెలిపారు. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణ సుప్రసిద్ధ సినీనటుడు అని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. కృష్ణ మన మధ్య లేకపోవడం విచారకరమని తెలిపారు. కృష్ణ ఇంటికి గతంలో చాలాసార్లు వచ్చానని వెల్లడించారు. గొప్ప విలక్షణ నటుడు కృష్ణ అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు చిత్రం చాలాసార్లు చూశానని... తెలిపారు. సందేశాత్మక చిత్రాలు ఎన్నో తీశారని గుర్తు చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఆదేశించామని వివరించారు.
‘‘కృష్ణ ఆతిథ్యమిస్తే చాలా సార్లు ఆయన ఇంటికి వచ్చాను. ఎలాంటి అరమరికలు లేకుండా ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి సేవలందించారు. అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాను తీశారు. కృష్ణ సేవలను, ఆయన చేసిన దేశభక్తి ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించాం. ఆయన కుటుంబసభ్యులకు దుఃఖాన్ని భరించే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.'' - సీఎం కేసీఆర్
ఇవీ చూడండి: