రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రిత సాగు, ప్రధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ తదితర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11.30కి జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జడ్పీ సీఈవోలు, పంచాయతీ అధికారులు, అటవీ అధికారులు, వ్యవసాయాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 16, 17 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ జరుపుతారు.
క్షేత్రస్థాయి పరిస్థితులు
అందులో భాగంగా ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదివారం నుంచి సమీక్షలు జరపనున్నారు. మంగళవారం కలెక్టర్లతో చర్చించి స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోనున్నారు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత పరిణామాలు, ప్రజలు, వివిధ రంగాల స్థితిగతుల గురించి సీఎం కలెక్టర్లను అడగనున్నారు. వర్షాల తీరుతెన్నులు, వ్యవసాయం, రైతు వేదికల నిర్మాణం తదితర అంశాలపై చర్చించనున్నారు. నియంత్రిత సాగు విధానం గురించి తెలుసుకోనున్నారు. ఉపాధి హామీని పెద్దఎత్తున చేపట్టేందుకు కేసీఆర్ ఆదేశించారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలో హరితహారం ప్రారంభం కానుంది. వీటితోపాటు ఇతర అంశాలపైనా సమీక్ష జరపనున్నారు.
పలు అంశాలు ప్రధాని దృష్టికి..
గతంలో కేంద్రానికి చేసిన సూచనలు, వివిధ పెండింగు అంశాలు, వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానం వంటి వాటిని సైతం ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళతారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలపై నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్ కుమార్‌ను శనివారం ఆదేశించారు.
ఇదీ చూడండి : స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు