పురపాలక ఎన్నికలు ముగియడం వల్ల.. పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అధికార యంత్రాంగంలోనూ.. భారీ మార్పులు, చేర్పులు చేశారు. పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన సీఎం... ఏకంగా 21 జిల్లాల కలెక్టర్లను మార్చారు. పెద్దఎత్తున కలెక్టర్ల బదిలీ నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నెల 11న పాలనాధికారుల సదస్సు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా కలెక్టర్ల సదస్సు జరగనుంది.
కలెక్టర్లకు సలహాలు, సూచనలు..
ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఆలోచనలను కలెక్టర్లకు వివరించి.. రానున్న రోజుల్లో తాను ఆశిస్తున్నది ముఖ్యమంత్రి కలెక్టర్లతో పంచుకోనున్నారు. పల్లెసీమల రూపు రేఖలు మార్చడమే లక్ష్యంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు రెండు దఫాల్లో అమలు చేశారు. ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని కోరనున్నారు. పురపాలక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించనున్న కలెక్టర్లకు సీఎం అవసరమైన సూచనలు చేస్తారు.
పాలనను పరుగులు పెట్టించడమే లక్ష్యం..
వందశాతం అక్షరాస్యత లక్ష్యంగా "ఈచ్ వన్ టీచ్ వన్" కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన విధానం, కలెక్టర్లు పోషించాల్సిన పాత్ర గురించి వివరించనున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడం సహా క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టించేలా కలెక్టర్లకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేయనున్నారు.
ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్ విచారణ