CM KCR Talk About Annabhav : ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జ్ వంశీధర్ రావు, పార్టీ మహారాష్ట్ర సీనియర్ నేతలు శంకరన్న డోంగే, మాణిక్ కదం ఉన్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ముందుగా కొల్హాపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ అంబబాయి అమ్మవారి ఆలయానికి ముఖ్యమంత్రి వెళ్లారు.
CM KCR Speech About Annabhav : సీఎం అక్కడి మహాలక్ష్మి స్వరూపమైన అంబబాయి అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ గ్రామంలో ప్రముఖ సంఘ సంస్కర్త దివంగత అన్నాభావ్ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం అన్నాభావ్ కుటుంబ సభ్యులను కలిసారు. ఇస్లాంపూర్లోని రఘునాథ్ దాదా పాటిల్ ఇంట్లో భోజనం చేశారు. అనంతరం వాటేగాం బహిరంగ సభలో మాట్లాడారు. అన్నాభావ్ సాటేను లోక్‌షాహెర్ బిరుదుతో సత్కరించారు. వంచిత, పీడిత ప్రజల తరఫున ఆయన నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని సమస్యలు వచ్చిన ఆయన వెనకడుగు వేయలేదని అన్నారు. అన్నాభావ్‌ను రష్యా గుర్తించినా.. భారత్ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. రష్యా ప్రభుత్వం ఆయనను పిలిపించి సత్కరించిందని గుర్తు చేశారు.
Annabhav Books in Marati : రష్యాలోని గ్రంథాలయాల్లో ఆయన విగ్రహాలు పెట్టారని తెలిపారు. రష్యా కమ్యూనిస్టు నేత మ్యాక్సిమ్ గోర్కి నవల 'మా' ప్రపంచ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. వివిధ భాషల్లో అనువాదం జరిగి ప్రతి దేశంలోనూ నవల అందుబాటులో ఉందని వివరించారు. రష్యా ప్రభుత్వం అన్నాభావ్‌ను భారత మ్యాక్సిమ్ గోర్కి అని ప్రశంసించిందని.. ఆయన రచనలు మరాఠీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అతని రచనలు ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదని.. సార్వజనీనమని అన్నారు. ఆ రచనల వల్ల ప్రపంచానికి విజ్ఞానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన రచనలను దేశ భాషల్లో ప్రచురించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన రాసిన గ్రంథాలు వెలుగులోకి తీసుకువస్తే దేశానికి గర్వ కారణమని అన్నారు. అంతటి వ్యక్తిని గౌరవిస్తే దేశానికి గౌరవం లభిస్తుందని వెల్లడించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ కూడా సిఫారుసు చేస్తుందని తెలియజేశారు.
Ragunadh Dada Patil Join BRS : బీఆర్ఎస్ విధానాలు నచ్చి షెట్కారీ సంఘటన్ అధ్యక్షులు రఘునాథ్ దాదా పాటిల్ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా త్వరలో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కేసీఆర్ బహుజన సామాజిక తాత్వికుడు, భారత పీడిత ప్రజల పక్షపాతి, ఛత్రపతి సాహు మహారాజ్ సమాధిని సందర్శించి.. నివాళులర్పించారు.
'మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అన్నాభావ్ రచనలు ప్రచురించాలి. అన్నాభావ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అన్నాభావ్ రచనలను వెలుగులోకి తేవడం దేశానికి గర్వకారణం. అన్నాభావ్‌ను గౌరవించుకుంటే మనకు కూడా గౌరవం లభిస్తుంది. ఆయనకి భారతరత్న ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలి. మహారాష్ట్రతో పాటు తెలంగాణ కూడా కేంద్రానికి సిఫారసు చేస్తుంది.'- కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
ఇవీ చదవండి :