CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. ఈ నెల 26న మోదీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. అదేరోజు సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటించేందుకు శుక్రవారం దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదు. తాను హాజరు కావాలనుకున్నా వద్దనడంతో వెళ్లలేదని సీఎం దీనిపై అప్పట్లో వివరణ ఇచ్చారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారని అప్పట్లో తెరాస పార్టీ విమర్శించగా.. కేసీఆర్ వైఖరిపై భాజపా ధ్వజమెత్తింది. గత ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. జ్వరం కారణంగా వాటిలో పాల్గొనలేదని కేసీఆర్ తెలిపారు. దీనిపైనా తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం నడచింది. తాజాగా ఐఎస్‌బీ సమావేశం గత వారం ఖరారయింది. ఇదే సమయంలో సీఎం ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పన కోసం వివిధ రాష్ట్రాల సందర్శనకు బయల్దేరారు. ఈ క్రమంలో ప్రధాని, సీఎంలు ఈ పర్యటనలోనూ కలిసే అవకాశం లేకపోయింది.
ఇవీ చదవండి: