కరోనా కారణంగా రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిన వేళ... ఆర్థిక నష్టం, బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సమీక్షించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమావేశం కానున్న సీఎం... ఆదాయానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై పూర్తిస్థాయిలో చర్చిస్తారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో రెవెన్యూ అంచనాలని కేవలం 26.51 శాతం మాత్రమే అందుకోగా... రూ. లక్షా 43 వేల కోట్ల రెవెన్యూ అంచనాకు గాను సెప్టెంబర్ నెలాఖరుకి... కేవలం రూ. 37 వేల కోట్లు మాత్రమే వచ్చాయి.
యాదాద్రి పురోగతిపై...
కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం తగ్గిపోగా జీఎస్టీ పరిహారం పూర్తిగా అందలేదు. ఈ తరుణంలో కరోనా చికిత్స, లాక్‌డౌన్ సమయంలో పేదలకు సాయం కారణంగా ఖజానాపై అదనపు భారం పడింది. వీటన్నింటి దృష్ట్యా పథకాలు, కార్యక్రమాలు, ఖర్చుల కోసం ప్రభుత్వం అప్పులపై ఆధారపడగా సెప్టెంబర్ నెలాఖరుకే రూ. 25 వేలకోట్లకు పైగా రుణం తీసుకొంది.
బడ్జెట్ అంచనాల్లో ఇది 78 శాతం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్‌లో ముందుకెళ్లేందుకు వీలుగా బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర సమీక్ష నిర్వహిస్తున్నారు. యాదాద్రి ఆలయ పనుల పురోగతిని సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు