CM KCR Independence Diamond Jubilee Closing Ceremony Speech : హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
CM KCR Speech at Hicc : ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. వేడుకల్లో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అన్న సీఎం.. సాతంత్య్ర సమరయోధుల గొప్పతనాన్ని నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాలన్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్న కేసీఆర్.. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్య్రోద్యమం ఏకతాటిపై నిలిపిందని గుర్తు చేశారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో లక్షలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సాతంత్ర్య సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచింది. విభిన్న సంస్కృతుల ప్రజలను స్వాతంత్య్రో ద్యమం ఏకతాటిపై నిలిపింది. - సీఎం కేసీఆర్
చిరునవ్వుతో ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయిందన్న కేసీఆర్.. మతోన్మాదుల చేతిలో గాంధీజీ కన్నుమూయటం తీవ్ర విషాదకరమన్నారు. బలహీనతలు, చెడు అలవాట్లు లేని మహోన్నత వ్యక్తి గాంధీజీ అని మండేలా అన్నారని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి.. గాంధీజీ చూపిన అహింస మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని తెలిపారు. మొదట్లో తన మార్గాన్ని వ్యతిరేకించిన వారు.. తర్వాత తన మార్గంలోకే వచ్చారని చెప్పారు.
గాంధీజీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నామని.. తెలంగాణ సంక్షేమ పథకాలపై గాంధీజీ ప్రభావం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఒకనాడు తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు ప్రశంసిస్తున్నారన్న ఆయన.. తెలంగాణ మోడల్ నేడు దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఈ క్రమంలోనే స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు నిజం చేద్దాంమని తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుదామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.
గాంధీజీ చూపిన అహింస మార్గంలోనే తెలంగాణ ఉద్యమం సాగింది. మొదట్లో నా మార్గాన్ని వ్యతిరేకించిన వారు.. తర్వాత నా మార్గంలోకే వచ్చారు. గాంధీజీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. తెలంగాణ సంక్షేమ పథకాలపై గాంధీజీ ప్రభావం ఎంతో ఉంది. తెలంగాణ మోడల్ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు నిజం చేద్దాం. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుదాం. - సీఎం కేసీఆర్
స్వతంత్ర స్ఫూర్తిని చాటేలా ఎన్నో కార్యక్రమాలు..: వజ్రోత్సవాలను నిరుడు ఆగస్టు ఎనిమిదో తేదీన ప్రారంభించుకున్నామని.. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. గాంధీ సినిమాను 35 లక్షల మంది ఉచితంగా చూశారని తెలిపారు. ప్రతి ఇంటిపైనా తెలంగాణలో తయారు చేసిన జాతీయ జెండా రెపరెపలాడిందన్న ఆమె.. కోటికి పైగా మొక్కలు నాటి ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేసుకున్నామని స్పష్టం చేశారు.