సీఎం కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి గల్ఫ్ వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్ర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ గతంలో ప్రకటించారు. గల్ఫ్‌కు వెళ్లే వారి ప్రాంత శాసనసభ్యులతో కలిసి తానే స్వయంగా అక్కడకు వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటానని చెప్పారు.
బడ్జెట్ సమావేశాల అనంతరం..
బడ్జెట్ సమావేశాల తర్వాత సౌదీ, ఖతర్, దుబాయ్, కువైట్, జెడ్డాలో సీఎం పర్యటించే అవకాశం ఉంది. ఆయా దేశాల్లోని పలు నగరాలు, ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి... ప్రవాసుల పరిస్థితులను తెలుసుకుంటారు. అక్కడి ప్రభుత్వాధినేతలు, అధికారులను కూడా కలవనున్నారు. సౌదీరాజును కూడా కలిసే అవకాశం ఉంది. అక్కడి పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమై టీఎస్ ఐపాస్‌తో పాటు రాష్ట్రంలోని అవకాశాలు వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.
ఏజెంట్ల మోసం.. వీసా గడవుపై..
ఉపాధి కోసం అక్కడకు వెళ్లిన వారితో సమావేశం కానున్న ముఖ్యమంత్రి... అక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారిని రాష్ట్రానికి తిరిగి రావాలనే పిలుపునిస్తారని అంటున్నారు. ఏజెంట్ల వల్ల మోసపోయి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న వారి గురించి, వీసా గడువు ముగిసి జైళ్లలో ఉన్న వారి విషయమై అక్కడి అధికారులతో చర్చిస్తారని చెబుతున్నారు. వారిని ప్రభుత్వ ఖర్చుతో స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హామీ ఇస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
బడ్జెట్ సమావేశాల్లో.. ప్రత్యేక విధానం..
ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు నేతృత్వంలోని బృందం ఇటీవలే రెండు రోజుల పాటు కేరళలో పర్యటించి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేశారు. గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే వారి కోసం బడ్జెట్ సమావేశాల్లోనే.. ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
నాలుగైదు రోజుల పాటు పర్యటన..
ఎంపిక చేసిన రంగాల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కోసం రుణాలు ఇప్పించేలా విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది. వచ్చే నెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 23, 24 వరకు సమావేశాలు కొనసాగవచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల పాటు పర్యటించే అవకాశాలున్నాయి.
ఇవీ చూడండి: హైదరాబాద్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్