CM meet with Collectors: హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా జరిగిన కలెక్టర్ల సదస్సులో దళితబంధు పథకం అమలు, వ్యవసాయ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దళితబంధు అమలు విషయమై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్న సీఎం.. హుజూరాబాద్‌తో పాటు ప్రకటించిన నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో ఇస్తామని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి దళితబంధు అమలు చేసే కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
నియోజకవర్గంలో 100 మందికి..
Dalit bandhu: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు దళితబంధు అందించేందుకు మరో 1200 కోట్లను సమకూరుస్తామని సీఎం స్పష్టం చేశారు. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాలను ప్రయోగశాలలుగా వినియోగించుకోనున్నారు. జనవరి మొదటి వారం నుంచి నాలుగు మండలాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. పథకం అమలు సందర్భంలో క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై దృష్టి సారించడంతో పాటు స్థానికుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. అక్కడ ఎదురయ్యే అనుభవాల ఆధారంగా దళితబంధు కార్యాచరణకు మార్గదర్శకాలు రూపకల్పన చేయాలని భావిస్తున్నారు.
కేంద్రం మొండి వైఖరితో తప్పలేదు..
ts agriculture: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర కర్షకులను కాపాడుకునే బాధ్యత కలెక్టర్లు, అధికారులపై ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. యాసంగిలో వడ్లు కొనబోమన్న నిర్ణయం బాధ కలిగించే అంశమే అయినా.. కేంద్రం మొండి వైఖరితో నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని ఆదేశించారు.పత్తి, కంది, వరి సాగుపై దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లు వ్యవసాయ అధికారులకు స్పష్టం చేశారు.
ఈనెల 28 నుంచే రైతు బంధు
Raithu bandhu: దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను ఎన్ని కష్టాలు వచ్చినా కొనసాగిస్తామని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతుబంధు సాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గతంలో మాదిరిగానే తక్కువ విస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి వారం, పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: