తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో తెరాస అధినేత, సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల శంకుస్థాపన చేసిన పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలపై సూచనలు చేశారు. ఆటంకాలు, నిధుల కొరత ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దసరాలోపు పూర్తి కావాలని ఆదేశించారు. భవనాల నిర్మాణ నమూనాలు నేతలకు అందజేసి... ఒక్కో జిల్లా కార్యాలయ నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును అందజేశారు.
నమోదులో లక్ష్యాన్ని చేరాలి...
పార్టీ సభ్యత్వ నమోదు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించారు. అనంతరం గ్రామకమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమర్థులైన వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.
విమర్శలు తిప్పికొట్టాలి
అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం సూచించినట్లు సమాచారం. నూతన నిర్మాణాల ఆవశ్యకతను వారికి వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఏయే అంశాలపై దృష్టి సారిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ బిల్లులపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమాయత్తం కావాలని ఆదేశించారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలుంటాయని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి : నేడే కేబినెట్ సమావేశం