CM KCR on National Panchayat Awards: రాష్ట్ర పంచాయతీలకు కేంద్ర అవార్డులపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామాలు దేశంలోనే అత్యున్నతంగా మారాయని పేర్కొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధిలో ముందు నిలిచామని అన్నారు. 46 ఉత్తమ అవార్డుల్లో 13 రాష్ట్రానికే దక్కడం గర్వకారణమని స్పష్టం చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో.. 9 విభాగాలకు గానూ 8 విభాగాల్లో తెలంగాణ అవార్డులు సాధించడం విశేషమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు అవార్డుల కోసం పోటీ పడ్డాయని.. అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయని కేసీఆర్ తెలిపారు. అందులో 13 తెలంగాణకే వచ్చాయని వివరించారు. మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం రాష్ట్రమే కైవసం చేసుకుందని పేర్కొన్నారు. 13 ర్యాంకుల్లోనూ నాలుగు మొదటి 4 ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్ప విషయమని అన్నారు.
దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం: పల్లెప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి కార్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో తెలంగాణ ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో.. దేశవ్యాప్తంగా పల్లెల అభివృద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లను, అధికారులను కేసీఆర్ అభినందించారు.
కేసీఆర్ ప్రణాళిక ప్రకారం: తెలంగాణ గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళిక ప్రకారం గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని చెప్పారు. నాలుగేళ్ల క్రితం సీఎం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశంలోనే అత్యధిక అవార్డులు రాష్ట్రానికే దక్కాయని అన్నారు. కేంద్రం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని ఎర్రబెల్లి వివరించారు.
మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించింది: ఒకప్పుడు గంగదేవిపల్లికి మాత్రమే అవార్డులు వచ్చేవని.. కానీ కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రంలోని పల్లెలు కొత్త రూపు దిద్దుకున్నాయని ఎర్రబెల్లి దయాకర్‌రావు వివరించారు. 46కు 46 అవార్డులు తెలంగాణకే వచ్చే స్థాయిలో మన పల్లెలున్నాయని అన్నారు. ఇందుకు మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. మిషన్ భగీరథకు రూ.19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
గుజరాత్‌కు ఇచ్చినట్లే తెలంగాణ మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని విజ్ఞప్తి చేశానని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు అవార్డులు ఇస్తూనే.. మరోవైపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను తగ్గిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పని దినాలు పెంచడంతో పాటు.. ఈ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని కోరినట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Panchayat awards 2023: జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెల సత్తా
కుల గణన.. రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేత.. కాంగ్రెస్ కొత్త రాజకీయం!