గత ఏడాది తరహాలోనే ఈ వర్షాకాలంలోనూ వరిధాన్యాన్ని సేకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr on Paddy Procurement) ప్రకటించారు. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లోనూ 6,545 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరపాలని పౌరసరఫరాలశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంఓ అధికారులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అధికారులతో ప్రగతిభవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు.
ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష (Cm Kcr Review) నిర్వహించి నిర్ణయాన్ని ప్రకటించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కనీస మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోళ్లు జరిపేందుకు కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు.
ఆల్ టైం రికార్డ్..
యాసంగి సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లలో రాష్ట్రానికి అరుదైన ఘనత సొంతమైంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేసిన కేసీఆర్ సర్కార్... ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు, ఇతర వనరులు అందుబాటులోకి తీసుకోవడం... ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాల అమలు రైతన్నకు వెన్నుదన్నైంది. రైతు సంక్షేమ చర్యల నేపథ్యంలో ఏటా పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా 2020-21 యాసంగి సీజన్‌లో మద్దతు ధరతో రైతుల నుంచి పౌరసరఫరాల సంస్థ రికార్డు స్థాయిలో సేకరించింది.
సవాళ్లు అధిగమించి...
ఇందిరా క్రాంతి పథం కొనుగోలు కేంద్రాల ద్వారా 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఆల్ టైం రికార్డు అని పౌరసరఫరాల సంస్థ అధికారికంగా వెల్లడించింది. ధాన్యం సేకరణ ప్రక్రియలో పలు ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనప్పటికీ... మొత్తం మీద రెండు రోజుల కిందట అన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో రూ.84 వేల కోట్లు విలువ చేసే 4కోట్ల 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌లతో పాటు జీసీసీ, హాకా వంటి ఏజెన్సీలకు రూ.1029 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించింది. గత ఏడాది లాగానే ఈసారి కూడా ధాన్యం భారీగా మార్కెట్ యార్డులకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: PADDY: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం ఆల్ టైం రికార్డ్