Kcr in Meeting: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర భాజపా తీరును గల్లీ నుంచి దిల్లీ వరకు ఎండగట్టాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెరాస విస్తృతస్థాయి భేటీలో స్పష్టం చేశారు. భాజపా దుష్ప్రచారాన్ని చూస్తూ ఊరుకోవద్దని.. కార్యకర్తల నుంచి మంత్రుల వరకు సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. వానాకాలం పంట కొనుగోళ్లపై కేంద్ర లక్ష్యం మేరకు సేకరణ పూర్తయిందని.. మిగతా ధాన్యం ఏం చేయాలో కేంద్రం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇందులో భాగంగా ఈనెల 20 న ప్రతి గ్రామంలో నిరసనలు తెలపాలని తెరాస నిర్ణయించింది.
వరి వేసే వారికి కూడా రైతు బంధు
paddy: రైతుబంధు యధావిధిగా అమలవుతుందని స్పష్టం చేసిన కేసీఆర్.. వరి వేసిన వారికి కూడా రైతుబంధు ఉంటుందని చెప్పారు. అయితే యాసంగి వరి కొనుగోలు చేయమని కేంద్రం చెబుతున్నందున.. ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను పార్టీ నేతలు ప్రోత్సహించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మిల్లర్లతో ఒప్పందాలు ఉన్న వారు వరి వేసుకోవచ్చునన్నారు.
విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలి
kcr on dallitha bandhu: దళిత బంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న కేసీఆర్.. దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు.శాసనసభ్యులు మరింత చురుగ్గా పనిచేయాలన్న కేసీఆర్...అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా పనిచేస్తూ విపక్షాల రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టాలని సూచించారు. కష్టపడి పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తనదేనని ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఓపిక పట్టిన నాయకులు, కార్యకర్తలకు తగిన సమయంలో పదవులు వస్తాయని తెలిపారు. ఈనెల 19న వనపర్తి, 20న జనగామ జిల్లాల్లో సీఎం పర్యటనలను వాయిదా వేశారు. మంత్రుల దిల్లీ పర్యటన, గ్రామాస్థాయిలో పార్టీ నిరసన కార్యక్రమాల వల్ల వాయిదా వేసుకున్నారు. ఈనెల 23న వనపర్తి నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు.