తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు తెరాస శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. తెరాస విద్యార్థి విభాగం నేతృత్వంలో కేక్ కట్ చేశారు. మంత్రి సత్యవతి రాఠోడ్, తదితరులు రక్తదానం చేశారు. హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కేక్ కట్ చేసి... పర్యటకులకు పంచి సంబరాలు జరుపుకున్నారు.
బేగంపేట పీఎస్ ఆవరణలో ఉత్తర మండల డీసీపీ కలమేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలను విరివిగా నాటడం వల్ల నగరంలోని కాలుష్యాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నగర శివారులోని మణికొండ వృద్ధాశ్రమంలో కృషి ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేసీఆర్ వెయ్యేళ్లు బతికితే మాలాంటి అనాధ వృద్ధులు ఎంతోమంది బాగుపడతారని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కొడుకు అందరికీ ఉంటే దేశం ఎంతో బాగుపడుతుందని వృద్ధులు ఆశించారు.