దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr delhi tour)... కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal)తో మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్రంలో యాసంగి, వర్షాకాలాల్లో పండే ధాన్యాన్ని సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని వివరించారు. ధాన్యంతోపాటు ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని కోరారు. కరోనా సమయంలో ధాన్యం, ఇతర పంటలను తామే కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.
దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తోందని... మూడు నాలుగు రోజుల్లో సమాచారం ఇస్తామని పీయూష్ గోయల్ తెలిపినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ధాన్యం ఉత్పత్తి పెరిగినందున పంటల వైవిధ్యం అవసరముందని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ అభిప్రాయపడ్డారని రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ చెప్పారు. గోధుమ సాగయ్యే పంజాబ్‌లోనూ... వరి పండిస్తుండడంతో ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరిగిందని ముఖ్యమంత్రితో కలిసి కేంద్రమంత్రిని కలిసిన తర్వాత వినోద్‌కుమార్ వెల్లడించారు.
వరుసగా రెండు రోజులపాటు...
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... నార్త్‌బ్లాక్‌లోకి వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో ఏకాంతంగా సమావేశమయ్యారు. సుమారు రెండుగంటలపాటు వారి మధ్య భేటీ కొనసాగింది. ఐతే ఏయే అంశాలపై చర్చించారనే విషయం తెలియరాలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదివారం రాత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిసి గంటన్నరపాటు వివిధ అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపాలోనూ కీలక శక్తిగా ఉన్న అమిత్‌షాతో వరుసగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవాళ హైదరాబాద్‌కు...
సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్... హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయయారు. భారీ వర్షాల వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇవాళ్టికి వాయిదా వేసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు
ఇదీ చదవండి : Gulab Cyclone Effect on Telangana: రాష్ట్రంలో 14 జిల్లాలకు రెడ్ అలర్ట్..