CM KCR Congratulated Chess Player Praneeth : పిన్న వయస్సులోనే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు 16 ఏళ్ల ఉప్పల ప్రణీత్ ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’ హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రాండ్ మాస్టర్ హోదా ప్రకటించిన నేపథ్యంలో ప్రణీత్, అతని తల్లిదండ్రులను సచివాలయం పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రణీత్‌ను దీవించారు. కష్టపడి ప్రణీత్‌కు శిక్షణ ఇప్పించి, గొప్పగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను అభినందించారు.
ప్రణీత్‌కు రూ.2.5కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ : చదరంగ ఆట పట్ల ప్రణీత్‌కు ఉన్న అభిరుచి, కఠోర సాధనే గ్రాండ్ మాస్టర్‌గా తీర్చిదిద్దాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో ప్రణీత్ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని... తెలంగాణకు, భారతదేశానికి గొప్ప పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అన్ని వేళలా రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రణీత్ సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగేందుకు కావాల్సిన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రెండున్నర కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎంకు ప్రణీత్ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ, క్రీడా రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అనడానికి ప్రణీత్ గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగిన తీరే నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
అవసరమైన రేటింగ్ సాధించి జీఎంగా అర్హత సాధించిన ప్రణీత్ : ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు సాధించిన నల్గొండ జిల్లాకు చెందిన ఉప్పల ప్రణీత్.. తాజాగా బాకు ఓపెన్ ఎనిమిదో రౌండ్లో టాప్ సీడ్ హాన్స్ నీమన్ (అమెరికా)కు షాకిచ్చి 2500.5 ప్రత్యక్ష రేటింగ్‌ను చేరుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్ కావాలంటే మూడు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్ ఉండాలి. ఆ అర్హత ప్రమాణాలను సాధించిన అతను జీఎంగా ఎదిగాడు. నిరుడు మార్చిలో ప్రణీత్ తొలి జీఎం నార్మ్ సాధించాడు. రెండో జీఎం నార్మ్‌ను గతేడాది జులైలో సొంతం చేసుకున్నాడు. మూడో నార్మ్‌ను గత నెలలో ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అవసరమైన రేటింగ్‌నూ సంపాదించాడు.
వీర్లపల్లి నందినికి రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం : వరల్డ్ చెస్ ఫెడరేషన్ ద్వారా ‘ఉమన్ క్యాండిడేట్ మాస్టర్’ గా గుర్తింపు పొందిన మరో తెలంగాణ తేజం, దళిత క్రీడాకారిణి, 19 ఏళ్ల వీర్లపల్లి నందినిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించేందుకు అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల కోసం 50 లక్షల రూపాయలను సీఎం ప్రకటించారు. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇవీ చదవండి: