కరోనా విషయంలో నిన్న కరీంనగర్‌లో జరిగిన ఘటనపై నేటి అత్యున్నత స్థాయి సమావేశంలో చర్చించామని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు కొన్ని సూచనలు చేశామని పేర్కొన్నారు. కరోనా విషయంలో కొన్ని దేశాలు అప్రమత్తంగా ఉంటే,మరికొన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించాయని చెప్పారు. రాష్ట్రంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, అయినప్పటికీ కరీంనగర్ ఉదంతం కొత్తగా ఉందన్నారు.
విమానాశ్రయం నుంచి ఐదుగురే..
తెలంగాణలో ఇప్పటి వరకు 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐదుగురు మాత్రమే శంషాబాద్ విమానాశ్రయంలో దిగారని... మిగిలిన 9 మంది రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్రానికి వచ్చారన్నారు.
'అందరినీ గుర్తించండి'
మార్చి 1 వరకు రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలు గుర్తించమని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఇప్పటికే స్వగ్రామాలు, ఇళ్లకు చేరిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్లకు రావాలని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. థియేటర్లు, ఫంక్షన్‌హాళ్లు, బార్లు మూసివేత గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః 'కరోనా'పై ప్రధాని అత్యున్నత స్థాయి సమీక్ష