కృష్ణా జల వివాదం నేపథ్యంలో నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్ ఆక్షేపించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింత ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుదుత్పత్తి కోసం నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. జల వివాదాల విషయంలో ప్రధాన మంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి వినియోగం, జలాల పంపకాల విషయంలో కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశించాలని ప్రధానిని కోరారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను ప్రధాని, జలశక్తి మంత్రికి రాసిన లేఖలకు జతపరిచారు.
తెలుగు రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా జలవివాదం కొనసాగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై కేఆర్‌ఎంబీకి కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ కూడా రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలని ఆదేశించింది. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.
ఈక్రమంలో సోమవారం నుంచి తెలంగాణ జెన్‌కో అధికారులు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు. రైతుల ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికోసం నీటిని వినియోగిస్తోందని ఏపీ మంత్రులు అభ్యంతరం తెలిపారు. దీనిపై రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జల వివాదంపై తాజాగా సీఎం జగన్.. ప్రధాని, కేంద్ర మంత్రికి లేఖలు రాశారు.
ఇదీ చదంవడి: శునకాన్ని స్కూటీకి కట్టి ఈడ్చుకెళ్లిన మహిళలు