CM JAGAN ON NELLORE ISSUE : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో రాజకీయం వేడెక్కుతోంది. కంచుకోట లాంటి జిల్లా వైసీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవలె ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని.. వెంకటగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత నుంచి తప్పించిన వైసీపీ అధిష్ఠానం.. తాజాగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేటు వేసింది. తాజాగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి సారించారు. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ పీఆర్ఎస్ ఆంజనేయులు, పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ సీఎం భేటీ అయ్యారు. నెల్లూరు రూరల్‌కు మరొకర్ని వైకాపా ఇన్‌చార్జ్‌గా నియమించాలని నిర్ణయించారు.
వైకాపా ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. తమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై సజ్జల, ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుతో సీఎం చర్చించారు. సమావేశానికి హోం శాఖ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. ప్రధానంగా ఇద్దరు నేతల వ్యవహార శైలిపై, తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్ల తెలిసింది. ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయం ఉందని, అనేక ఆధారాలను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన దృష్ట్యా వీటిపైనా చర్చించినట్లు సమాచారం.
ఈరోజు మరోసారి నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి చేరుకున్నారు. నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇంఛార్జ్ పదవి నుంచి కోటంరెడ్డిని తప్పించాలని నేతలకు సూచించారు. తాజాగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ చదవండి: