Jagan election team: నోటి దురుసు, దూకుడు తనంతో తరచూ వివాదాలకు కేంద్ర బిందువులుగా మారే వారిలో కొందరికి.. ప్రస్తుత మంత్రివర్గంలో ఏపీ సీఎం జగన్ చోటు కల్పించారు. తాజా మంత్రివర్గంలో వారు చోటు సంపాదించడానికీ.. వారి వ్యవహారశైలే కలిసొచ్చిందేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి గతంలో కొడాలి నాని మంత్రిగా ఉండేవారు. ఇప్పుడు పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను మంత్రి పదవి వరించింది. మంత్రివర్గంలో కొడాలి నాని వారసుడిగా ఆయన లేని లోటును తీరుస్తారంటూ సొంత పార్టీ నేతలే నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. తన అనుచర బృందంతో కలిసి పట్టపగలే కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి కార్లలో వెళ్లడం, అసెంబ్లీ సాక్షిగా సొంత పార్టీ ఎంపీపైనే తీవ్రంగా విమర్శలు చేయడమే ఈయనకు కలిసి వచ్చిందని చర్చ నడుస్తోంది.
కారుమూరికి 'పెద్ద బాండ్'..: పశ్చిమగోదావరి జిల్లా తణకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు మంత్రి పదవి అనే పెద్ద బాండ్ దక్కిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల తణుకు పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ఆరోపణలకు ఆయన కేంద్ర బిందువు అయ్యారు. తనకేం సంబంధంలేదని చివరకు వివరణ ఇచ్చుకున్నారు.
ధర్మానకు న్యాయం..: శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు న్యాయం జరిగిందనే చర్చ వైకాపాలో వినిపిస్తోంది. అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయస్థానాలు, న్యాయమూర్తుల పరిమితులపై ఆయన అసెంబ్లీలో చర్చకు తెరలేపిన విషయాన్ని పార్టీ నేతలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. ఈయన గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
'వాగ్భాణాలే' వరించాయా..?: అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. చంద్రబాబు కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని అసెంబ్లీలో మాట్లాడారనే ఆరోపణలు సైతం ఈయనపై ఉన్నాయి. దీంతో కౌరవ సభకు తాను హాజరు కానని... మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు ప్రకటించారు. అక్రమ మైనింగ్ చేస్తున్నారని అంబటిపై సొంత పార్టీ నేతలే కోర్టుకు వెళ్లడమూ గతంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: హస్తినలో "రైతుదీక్ష"కు సర్వం సిద్ధం.. తరలిన గులాబీ నాయకదళం..