ప్రముఖ టీవీ ఛానల్‌లో సీనియర్ రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మనోజ్ కుమార్ కరోనాతో మృతిచెందడం తమను కలచివేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇది చాలా బాధకరమైన విషయమని పేర్కొన్నారు. సీఎల్పీ పక్షాన భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వైద్యులకు తగినన్ని మాస్కులు, పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం వల్ల వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది కరోనా కాటుకు బలైపోతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గాంధీ ఆసుపత్రిలో తగినన్ని బెడ్లు, సరైన వసతులు లేకపోవటం వల్ల రోగులకు ఏంచేయాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా కట్టడికి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సిబ్బందికి అన్ని రకాల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
గచ్చిబౌలిలో కొత్తగా ప్రారంభించిన టిమ్స్‌లో ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి? అలాగే అక్కడ ఉన్న వసతులు, రాష్టంలోని ఇతర ఆస్పత్రుల్లో ఉన్న బెడ్ల సంఖ్య, ఆయా ఆస్పత్రుల్లో తీసుకుంటున్న చర్యలపైనా ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని భట్టి డిమాండ్ చేశారు.