Bhatti Vikramarka fires on CM KCR : భారీవర్షాలొస్తాయని తెలిసినా.... ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి ప్రదర్శించినందునే వరదల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా నిర్మించిన చెక్‌డ్యాంల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా లేకపోవటంతోనే వరద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడిన భట్టి.. వరదల విషయంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Bhatti Vikramarka Latest Comments : ప్రగతి భవన్‌లో కండువాలు కప్పేందుకు పక్కరాష్ట్రాల నేతలకు విమానాలు పంపే సీఎం కేసీఆర్.... రాష్ట్ర ప్రజలు ప్రమాదంలో ఉంటే ఒక్క హెలీక్యాప్టర్ పంపమన్నా స్పందించలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గతేడాది వరదల వేళ భద్రాచలానికి వెయ్యికోట్లు ప్రకటించారన్న భట్టి... మళ్లీ వరదలొచ్చినా ఆ నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు. ప్రజలను మోసం చేయటం సీఎం కేసీఆర్‌కు అలవాటైందని... వరదల నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకునేలా సీఎస్ శాంతికుమారి చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క కోరారు.
'వాతావరణశాఖ హెచ్చరించినా ముందస్తు చర్యలు లేవు. అధికారులను అప్రమత్తం చేయటంలో సర్కార్ విఫలమైంది. వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో లేనప్పటికీ వాటిని ముందే పసిగట్టి ప్రజలను జాగ్రత్త పరిచే అవకాశం ఉంది. రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం ప్రాజెక్టులు కట్టారు. అడ్డగోలుగా చెక్‌డ్యామ్‌లు కట్టడం వల్లే ప్రమాదాలు. రాజకీయ అవసరాల కోసమైతే ఇతర రాష్ట్రాలకు కేసీఆర్ విమానాలు పంపిస్తారు. రాష్ట్ర ప్రజలు ప్రమాదంలో ఉంటే హెలిక్యాప్టర్ పంపమన్నా స్పందించలేదు. ప్రజలను మోసం చేయటం కేసీఆర్‌కు అలవాటైంది. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టం అంచనా వేయాలి. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.'-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజినీర్ కేసీఆరే : వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేసీఆర్ వచ్చాక ఇరిగేషన్ ప్రాజెక్టులు సాంకేతికతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజినీర్ కేసీఆరే అని ఆరోపించిన భట్టి... రాత్రి పూట డిజైన్ చేసి మూడు చెక్ డ్యాంలకు ముఖ్యమంతి ప్లాన్ గీశాడన్నారు. కేసీఆర్ అనాలోచిత ప్రాజెక్టుల డిజైన్ వల్ల ప్రజలు మునిగిపోతున్నారని మండిపడ్డారు. వరద ప్రాంతాలకు అధికారులను పంపి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ భద్రాద్రి రాముడిని కూడా మోసం చేశాడన్న భట్టి విక్రమార్క.. జనాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని గద్దె దించేలా చూడమని రాముడ్ని మొక్కుతున్నానని పేర్కొన్నారు.
ఇవీ చదవండి :