పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కBhatti vikramarka) విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్రమశిక్షణ కలిగి కాంగ్రెస్ వాదులెవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, విధానాలను, అమలు చేయడం కోసం అందరూ ముందుండి నడవాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ తప్పని సరిగా ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యవహరాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌కు రేవంత్ రెడ్డి(Revanth Reddy) 50 కోట్లు ఇచ్చి పదవి తెచ్చుకున్నారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు వచ్చిన 61,121 ఓట్లన్నీ కాంగ్రెస్‌కు చెందినవిగా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. త్వరలో జరగబోవు హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస-భాజపాల మధ్య ఓట్లు చీలినా.. స్థిరమైన ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీడియో వైరల్
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎన్నికల(huzurabad by elections) నేపథ్యంలో పాడి కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) పేరిట వచ్చిన ఓ ఆడియో వైరల్ (audio viral) అయింది. మాదన్నపేట యువకుడితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన... తెరాస హుజూరాబాద్ టికెట్ (trs ticket) తనకే వస్తుందని అన్నారు. మాదన్నపేటలోని యువత వివరాలు కావాలంటూ అడిగిన కౌశిక్‌రెడ్డి... ఎన్ని డబ్బులు కావాలో తాను చూసుకుంటానన్నారు.
రాజీనామా
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవదన్న రేవంత్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీనియర్లను కాదని తెదేపా నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. అమ్ముడుపోయింది తాను కాదని.. రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయినా తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌రెడ్డి సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Kaushik Reddy: '50 కోట్లు ఇచ్చి రేవంత్ అధ్యక్షుడయ్యాడు.. ఆరునెలల్లో కాంగ్రెస్ ఖాళీ!'