తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని మారోమారు స్పష్టం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). కృష్ణా, గోదావరి రెండు నదులపై రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల వల్ల ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. కేసీఆర్ (Kcr) చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదని మండిపడ్డారు.
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం (Sangameshwaram) వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నాలు చేసినట్లు భట్టి అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 11 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తరలిపోతాయని ముందే చెప్పినట్లు వివరించారు. సంగమేశ్వరం ప్రాజెక్టు నిండితే కానీ శ్రీశైలం నిండదు. అప్పుడు నాగార్జున సాగర్‌కు నీళ్లు రావని పేర్కొన్నారు.
శ్రీశైలం మీద ఆధారపడితే గత ప్రభుత్వాలు నిర్మించిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులకు నీటి ప్రమాదం పొంచి ఉందని భట్టి తెలిపారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద ఆధారపడ్డ సాగు భూములున్నీ ఎండిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీ అరిచి గీపెట్టినా నిద్ర కేసీఆర్ నిద్ర లేవలేదని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలకంటే కేసీఆర్‌కు ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమని చెప్పుకొచ్చారు. పోతిరెడ్డిపాడును కాంగ్రెస్ మొదలు పెట్టింది కానీ కాంగ్రెస్ మంత్రులు ప్రోత్సహించారనడం అసత్య ప్రచారమన్నారు. పోతిరెడ్డిపాడును ఆపాలంటూ కాంగ్రెస్ నాయకులే ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు.
ఇదీ చూడండి: Harish Rao: 'షుగర్ ఉన్న వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు'