తెరాస ప్రభుత్వం ఎస్సీలను అణచివేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని తెలిపారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయంలో అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు కారకులైన పోలీసులను పదవుల నుంచి తొలగించాలని కోరారు. హైదరాబాద్ గాంధీనగర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ దళిత ఆవేదన దీక్షలో ఆయన పాల్గొన్నారు.
న్యాయం కోసం పోరాటం
మరియమ్మ కుటుంబానికి న్యాయం చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని... కుమార్తెలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎస్సీల జీవితాలు, వారి హక్కులే ముఖ్యమని భట్టి స్పష్టం చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.
దళితుల కోసం కాంగ్రెస్
దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. దీనిని రాజకీయం చేయొద్దని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోరాటం చేస్తామని తెలిపారు. దళితుల ప్రాణాలను రక్షించడానికి ఉన్న అన్ని వ్యవస్థలను కలుస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు మోసపోతున్నారు: ఉత్తమ్