CLP leader Bhatti clarity: రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌లోకి చేర్చుకునే వారిలో ఎవరికి కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి, అసెంబ్లీ టికెట్లు ఇస్తామని హామీలు ఇవ్వలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు లేకుండానే పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, పార్టీ భావజాలం, సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి కొత్తగా చేరిన వారి సేవలను ఉపయోగించుకుంటామని ఆయన వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల ఎంపిక ప్రక్రియ పార్టీ విధానపరంగానే జరుగుతుందని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భావజాలాన్నినమ్మి, వాటిని వ్యాప్తి చేయడం కోసం పార్టీలోకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని భట్టి తెలిపారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రతి కార్యకర్త సమిష్టి కృషి వల్లనే పార్టీ బలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి ఇప్పటి వరకు హస్తం వెన్నంటే ఉన్న కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ పార్టీని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామన్నారు. పార్టీ బలంగా ఉండడం వల్లనే... కాంగ్రెస్‌లోకి రావడానికి ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారని వివరించారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ కంచుకోటను బలంగా ఉంచిన వారిని ఎవరి కోసమో... ఫణంగా పెట్టలేమన్నారు. కష్టకాలంలో పార్టీ వెన్నంటే ఉన్న నాయకుల ప్రయోజనాలు కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఒత్తిడులకు గురి కాకుండా ఉన్న వారి ప్రయోజనాలను విస్మరించలేమన్నారు.